సరైన వెంటిలేష‌న్ లేకుంటే.. క‌రోనా ముప్పు ఎక్కువే

సరైన వెంటిలేష‌న్ లేకుంటే.. క‌రోనా ముప్పు ఎక్కువే
  • క్లోజ్డ్ రూముల్లో 6 అడుగులైనా.. 60 అడుగులైనా.. సేమ్ రిస్క్
  • అమెరికాలోని ఎంఐటీ సైంటిస్టుల హెచ్చరిక 

కేంబ్రిడ్జ్: ఇత‌రుల నుంచి క‌నీసం ఆరు ఫీట్ల దూరం ఉంటే.. క‌రోనా సోకే ముప్పు త‌క్కువ‌గా ఉంటుంద‌ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్ వో) ఇదివ‌ర‌కే గైడ్ లైన్స్ జారీ చేసింది. అయితే త‌లుపులు, కిటికీలు అన్నీ మూసి ఉన్న రూమ్ లు, ఆఫీసుల్లో ఆరు ఫీట్ల దూరం ఉన్నా.. 60 ఫీట్ల దూరం ఉన్నా.. క‌రోనా ముప్పు ఒకేలా ఉంటుంద‌ని అమెరికాలోని మ‌సాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఎంఐటీ) సైంటిస్టులు స్పష్టం చేస్తున్నారు. క్లోజ్డ్ ఏరియాలో ఎంతసేపు ఉంటున్నారు..? గాలి ప్రసారం ఎలా ఉంది..? వైరస్ రకం, మాస్క్ వాడకం, శ్వాస తీసుకునే తీరు, తినడం, మాట్లాడడం వంటి అంశాల ఆధారంగా కరోనా సోకే ముప్పును స్టడీ చేశారు. క్లోజ్డ్ ఏరియాలో మాస్కులు పెట్టుకున్నా, ఎంత దూరంలో ఉన్నా.. వైరస్ సోకే ముప్పు అంతటా ఒకేలా ఉంటుందని గుర్తించారు. 
సిగరెట్ పొగలాగే రూం అంతటా..
ఒక క్లోజ్డ్ రూమ్ లో ఎవరైనా సిగరెట్ కాల్చితే.. రూమ్ అంతటా పొగ, దాని ఏరో సాల్స్ వ్యాపిస్తాయని, రూమ్ లో ఎక్కడున్నా ఆ సిగరెట్ పొగను ఇతరులు పీల్చుకునే ప్రమాదం ఉంటుందని వర్సిటీ సైంటిస్ట్ బజెంట్ వెల్లడించారు. ఇండోర్స్ లో కరోనా డ్రాప్లెట్ల రిస్క్ అలాగే ఉంటుందన్నారు. క్లోజ్డ్ రూమ్ లలో అందరూ మాస్కులు పెట్టుకుంటే ఎవరికైనా వైరస్ ఉన్నా.. ఇతరులకు సోకే ప్రమాదం తగ్గుతుందన్నారు. ఇండోర్స్ లో ఉండే టైం పెరిగిన కొద్దీ రిస్క్ పెరుగుతుందన్న విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్.ఓ), సీడీసీ గైడ్ లైన్స్ లో పరిగణలోకి తీసుకోలేదని సైంటిస్టులు చెప్పారు. గాలి, వెంటిలేషన్ బాగున్నచోట కరోనా రిస్క్ తక్కువగా ఉంటుందన్నారు. ఎయిర్ ఫిల్టర్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడం కంటే కిటికీలు తెరవడం, ఫ్యాన్లు వేసుకోవడం వల్ల వైరస్ ముప్పు తగ్గించవచ్చని సూచించారు.